న్యూఢిల్లీ: తెలంగాణపై ఓపిక పట్టాల్సిందేనని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు సూచించారు. శాసనసభ రద్దు కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గురువారం రాత్రి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ గౌడ్, బాల నాయక్ వీరప్ప మొయిలీని కలిశారు. రాజీనామాల విషయంలో ప్రజాప్రతినిధులు సహనం వహించాలని మొయిలీ అన్నారు. సాధారణ పరిస్థితులను నెలకొల్పడంలో విఫలమైతే తెలంగాణ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు.
తెలంగాణపై ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అందరూ ఆంగీకరించారని, దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని, ఇటువంటి సమయంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకూడదని ఆయన అన్నారు. జనవరి 5వ తేదీ తర్వాత ప్రారంభించాల్సిన ప్రక్రియ హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉందని, దాన్ని త్వరలో ప్రారంభిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించినా దాన్ని శాసనసభ పరిశీలనకు పంపాల్సి ఉంటుందని, అందువల్ల శాసనసభ రద్దు కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి