తెలంగాణపై జాప్యానికే కాంగ్రెసు మొగ్గు

ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకత ఏముంది, మీరంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రతినిధులా, అందుకే తెలంగాణ గురించి అడుతున్నారని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. దీన్ని బట్టి కూడా తెలంగాణపై తొందరపడకూడదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు అనుకోవచ్చు. నిదానంగా సమస్య పరిష్కారం గురించి ఆలోచించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. సంయమనం పాటించాలని, ఇప్పుడు తొందర పడాల్సిన అవసరం లేదని పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులు రాష్ట్ర నాయకులకు చెబుతున్నారు.ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో శుక్రవారం సోనియా గాంధీ అదే విషయం చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీకి సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఇతర పనుల కారణంగా హాజరు కాలేదు. కాగా, తెలంగాణపై చర్చించేందుకు ఫిబ్రవరిలో కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీ ఇదే కావడం, ఇప్పటి వరకు తెలంగాణపై ఆ కమిటీ సమావేశం కాకపోవడం వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.