ఆ వేధింపులకు గురైంది నేనే: మౌనం వీడిన స్టార్ రెజ్లర్
భారత కుస్తీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తూ స్టార్ రెజ్లర్ ఒలింపియన్ వినేష్ ఫోగాట్ సంచలన నిజాన్ని బయటపెట్టారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఆరుగురు మహిళా క్రీడాకారిణులలో తాను కూడా ఒకరినని ఆమె మొదటిసారిగా బహిరంగంగా అంగీకరించారు. ఆదివారం (మే 3) విడుదల చేసిన ఓ భావోద్వేగ వీడియో సందేశంలో వినేష్ ఫోగాట్ తన గోడును వెళ్లగక్కారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండటం, బాధితుల గుర్తింపును రహస్యంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల కారణంగా తాను ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని ఆమె తెలిపారు. అయితే ప్రస్తుతం తన రీ-ఎంట్రీకి ఎదురవుతున్న అడ్డంకులు, రెజ్లింగ్ ఫెడరేషన్ వైఖరి తనను ఈ నిజాన్ని బయటపెట్టేలా చేశాయని ఆమె పేర్కొన్నారు.
ట్రయల్స్ వేదికపై అభ్యంతరం
2026 ఆసియా క్రీడలకు ముందు నిర్వహించబోయే సెలక్షన్ ట్రయల్స్ వేదికపై వినేష్ ఫోగాట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ట్రయల్స్‌ను కావాలనే ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. గోండా అనేది బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు కంచుకోట వంటిదని, అక్కడ ఒక ప్రైవేట్ కళాశాలలో పోటీలు నిర్వహించడం ద్వారా పారదర్శకత లోపిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్ ప్రభావం ఉన్న చోట నిష్పక్షపాతంగా ఎంపిక జరుగుతుందన్న నమ్మకం లేదని వినేష్ ఫోగాట్ స్పష్టం చేశారు.

వ్యవస్థపై బ్రిజ్ భూషణ్ పట్టు
బ్రిజ్ భూషణ్ ప్రస్తుతం అధికారిక పదవిలో లేకపోయినా.. కుస్తీ సమాఖ్య కార్యకలాపాలపై ఆయన ప్రభావం ఇంకా కొనసాగుతోందని వినేష్ ఫోగాట్ ఆరోపించారు. "నేను స్వయంగా ఫిర్యాదు చేసిన ఆరుగురు బాధితుల్లో ఒకరిని, ప్రస్తుతం నా సాక్ష్యం కోర్టులో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాకాలోకి వెళ్లి పోటీ చేయడం మానసికంగా, భావోద్వేగపరంగా చాలా కష్టం" అని ఆమె అన్నారు. మ్యాచ్ రెఫరీలు ఎవరు ఉండాలి, ఎవరికి ఎన్ని పాయింట్లు ఇవ్వాలి అనే విషయాల్లో బ్రిజ్ భూషణ్ అనుచరుల జోక్యం ఉంటుందని వినేష్ ఫోగాట్ అనుమానం వ్యక్తం చేశారు.
🇮🇳🙏 pic.twitter.com/hQrGmMLMrS
— Vinesh Phogat (@Phogat_Vinesh) May 3, 2026
తిరిగి మొదలైన వివాదం
2023లో వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి అగ్రశ్రేణి రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సుదీర్ఘ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో క్రీడాకారుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీసింది. బ్రిజ్ భూషణ్ ఈ ఆరోపణలను వరుసగా తోసిపుచ్చుతున్నప్పటికీ, లైంగిక వేధింపుల కేసులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. సుమారు 18 నెలల విరామం తర్వాత తిరిగి రింగ్‌లోకి రావాలని చూస్తున్న వినేష్‌కు, తాజా పరిస్థితులు సవాలుగా మారాయి. ఈ వ్యవహారంపై క్రీడా మంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications