షాకింగ్.. కదులుతున్న విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు!
చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆదివారం తెల్లవారుజామున ఓ విమాన ప్రయాణీకుడు చేసిన పని కలకలం సృష్టించింది. షార్జా నుంచి చెన్నై వచ్చిన ఎయిర్ అరేబియా విమానంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.ఎయిర్ అరేబియా విమానం ఆదివారం తెల్లవారుజామున చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. రన్‌వేపై ల్యాండ్ అయిన తర్వాత విమానం నెమ్మదిగా టాక్సీవే మీదుగా పార్కింగ్ బే వైపు వెళ్తోంది. ఆ సమయంలో విమానంలోని ఓ ప్రయాణికుడు హఠాత్తుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచి బయటకు దూకేశాడు. విమానం ఇంకా కదులుతుండగానే అతను ఈ సాహసం చేయడంతో తోటి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
అనారోగ్యమే కారణమా?
విమానాశ్రయ అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సదరు ప్రయాణికుడు విమాన ప్రయాణంలో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రయాణ సమయంలో అతను తనకు వాంతులు అవుతున్నాయని సిబ్బందికి ఫిర్యాదు చేశాడని.. విమానంలోనే రెండుసార్లు వాంతులు చేసుకున్నాడని అధికారులు వెల్లడించారు. ఆ అనారోగ్య పరిస్థితుల్లోనే అతను గందరగోళానికి గురై అలా ప్రవర్తించాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అప్రమత్తమైన భద్రతా దళాలు
ప్రయాణీకుడు కిందకు దూకగానే పైలట్ వెంటనే గ్రౌండ్ సెక్యూరిటీని అప్రమత్తం చేశాడు. అక్కడ విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది మెరుపువేగంతో స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని తదుపరి విచారణ నిమిత్తం విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదని.. ఇతర ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.
విమాన రాకపోకలకు అంతరాయం
ఈ అవాంఛనీయ ఘటన కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాన రన్‌వేను తెల్లవారుజామున 3:23 నుంచి 4:23 గంటల వరకు మూసివేశారు. ఆ సమయంలో రావాల్సిన విమానాలను సెకండరీ రన్‌వేకు దారి మళ్లించారు. ఈ ప్రయాణీకుడు తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. విమానయాన భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అధికారులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.














Click it and Unblock the Notifications