"బంగాళదుంప–మిల్ మేకర్ ఫ్రై" నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ..?
బంగాళదుంపతో చేసే వంటకాలు అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా ఇష్టం. ఫ్రైగా చేసినా, కూరగా వండినా, కుర్మాగా చేసినా... ఏ రూపంలో చేసినా బంగాళదుంప రుచి ప్రత్యేకంగా ఉంటుంది. బిర్యానీ, పులావ్, చపాతీ, రోటీ, అన్నం-ఏ వంటకంతో కలిపినా ఇది అద్భుతంగా సరిపోతుంది. అలాంటి రుచికరమైన వంటకాలలో ఒకటి బంగాళదుంప-మిల్ మేకర్ ఫ్రై.
మిల్ మేకర్ లేదా Soya chunksతో చేసే ఈఫ్రై ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల ఇది పోషకాహారంగా కూడా భావిస్తారు. ఉల్లిపాయలు, టమోటాలు, మసాలా దినుసులతో తయారయ్యే ఈ ఫ్రై చికెన్ లేదా మటన్ కి మంచి శాఖాహార ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. అన్నం, రోటీ, పులావ్, నాన్ లేదా చపాతీతో ఈ ఫ్రై ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టేస్టీ టేస్టీ ఫ్రై ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

కావలసిన పదార్థాలు..
మిల్ మేకర్ (సోయా చంక్స్) - 1 కప్పు
బంగాళదుంపలు - 1 నుంచి 2 (మధ్యస్థ పరిమాణం, ముక్కలుగా కోసినవి)
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
టమోటాలు - 2 (పేస్ట్ లేదా సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం పొడి - 1 నుంచి 2 టీస్పూన్లు
పసుపు - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పోపు దినుసులు - ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క
కొత్తిమీర - కొద్దిగా (అలంకరణ కోసం)
తయారీ విధానం..
మొదట సోయా చంక్స్‌ను సిద్ధం చేయాలి. ఒక పాత్రలో వేడి నీరు తీసుకుని అందులో సోయా చంక్స్‌ను 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని బాగా పిండి అదనపు నీటిని తీసివేసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క వంటి పోపు దినుసులు వేసి వేయించాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేపాలి.
ఇప్పుడు టమోటా పేస్ట్ లేదా తరిగిన టమోటాలు వేసి కలపాలి. తరువాత పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి మసాలా బాగా కలిసే వరకు ఉడికించాలి. మసాలా నుండి నూనె పైకి తేలే వరకు వేయిస్తే కూరకు మంచి రుచి వస్తుంది.
తర్వాత బంగాళదుంప ముక్కలు, నానబెట్టిన మిల్ మేకర్ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు బంగాళదుంపలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
చివరిగా గరం మసాలా చల్లి కలపాలి. కొత్తిమీర తరిగి పై నుంచి చల్లాలి. కూర కొద్దిగా మందంగా అయ్యే వరకు ఇంకొంచెం ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి.












Click it and Unblock the Notifications