న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్న తీరుపై కాంగ్రెసు కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రోజుకో బంద్, పూటకో ధర్నా చేసి తెలంగాణ నేతలు సాధించేదేమీ లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారని ఆయన తెలంగాణ నాయకులను ప్రశ్నించారు. విద్యార్థి, వైద్య గర్జనలు, మహిళల గర్జనలు...ఈ జాబితా వినడానికే విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. జన జీవనాన్ని స్తంభింపజేసి, విద్యార్థుల్లో ఉద్రేకాన్ని రెచ్చగొట్టడం వల్ల ఒరిగేది శూన్యమేనని ఆయన అన్నారు.
తెలంగామ ఇవ్వడమంటే రాత్రికి రాత్రి వండి వడ్డించడం వంటిది కాదని, శాంతియుత పరిస్థితులకు అందరూ సహకరించాలని, తర్వాత తెలంగాణ ఇవ్వాలని నిర్ణయం జరిగితే తెలంగాణ రావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని, దాని వల్ల తెలంగాణ ప్రక్రియ వెనక్కి పోతుందని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి తీరును కూడా ఆయన తప్పు పట్టారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి