హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసులోనే ఏకాభిప్రాయం లేదని బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ అన్నారు. బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం ఎబివిపి ఆధ్వర్యంలో హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటైన తెలంగాణ విద్యార్థి రణభేరి సభలో పాల్గొనడానికి ఆమె శనివారం హైదరాబాదు వచ్చారు. ఆమెకు బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, నాయకులు ఇంద్రసేనా రెడ్డి తదితరులు స్వాగతం చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయ సాధనకు కేంద్రానికి ఇంకెంత సమయం కావాలని ఆమె ప్రశ్నించారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం తనకు ఉందని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.
తాము చిన్న రాష్ట్రాలకు అనుకూలమే గానీ ప్రతి రాష్ట్రాన్నీ విభజించడానికి కుదరదని ఆమె అన్నారు. పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రతిపాదించే విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ప్రైవేట్ బిల్లు ఆమోదం పొందదని ఆమె అన్నారు. ప్రైవైట్ బిల్లు ప్రతిపాదనకు రాష్ట్రపతి అనుమతి కావాల్సి ఉంటుందని, అది కూడా అంత సులభమైన విషయం కాదని, ఇది వరకటి అనుభవం ఈ విషయంలో తమకు ఉందని ఆమె అన్నారు. ధరలను అదుపు చేయడంలో యుపిఎ ప్రభుత్వం విఫమైందని, ప్రభుత్వం వైఫల్యం వల్లనే ధరలు పెరిగాయని ఆమె విమర్శించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి