హైదరాబాద్: కూలిన భవంతి శిథిలాల కింద ఓ వ్యక్తి 18 గంటల పాటు ఉండి బతికి బయటపడ్డాడు. హైదరాబాదులోని నారాయణగుడాలో నిర్మాణంలో ఉన్న ఓ భవంతి శుక్రవారంనాడు కుప్ప కూలిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 13 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయానికి 13 మృతదేహాలను వెలికి తీశారు. కాగా, భవనం వాచ్ మన్ మల్లయ్యను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. అతను శిథిలాల కింద 18 గంటల పాటు బతికే ఉన్నాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆ భవన నిర్మాణం పనుల్లో ప్రతి రోజు 30 నుంచి 40 మంది దాకా పని చేస్తుంటారు. భవనం కూలిన సమయంలో కొంత మంది భోజనాలకు వెళ్లడంతో బతికి బయట పడ్డారు. మరో ఐదుగురు వేరే పనుల మీద బయటకు వెళ్లారు.
నారాయణగుడా ఫ్లైఓవర్ పక్కన గత 20 ఏళ్లుగా రెండంతస్థుల భవనం ఉంది. మొదటి నుంచి కూడా దీనికి ఎటువంటి అనుమతులూ లేవు. దానిపైనే మరో రెండో ఆంతస్థులు వేయడానికి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వాచ్ మన్ మల్లయ్య, భార్య, అతని ఇద్దరు పిల్లలు ఆ భవనంలోనే కాపురం ఉంటున్నారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన కూలీలు. ఈ భవనం పక్కనే బ్రిలియంట్ స్కూల్ ఉంది. శుక్రవారం పక్క భవనం కూలడంతో శనివారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి