బెంగళూరుకు మరో వందేభారత్, రూట్.. ముహూర్తం- నాలుగున్నర గంటల్లోనే తిరుపతికి..!!
తిరుపతి - బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. రైల్వే శాఖ త్వరలో తిరుపతి మీదుగా బెంగళూరుకు వందేభారత్ అందుబాటులోకి రానుంది. అదే విధంగా సికింద్రాద్ - తిరుపతి వందే భారత్ కు హాల్టింగ్ స్టేషన్లు పెంచాలనే ప్రతిపాదన పైనా నిర్ణయం రానుంది. ఇప్పటికే కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ మధ్య నడుస్తున్న వందేభారత్ కు డిమాండ్ పెరిగింది. దీంతో.. ఇప్పుడు విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరు రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు అందుబాటు లోకి వస్తే నాలుగున్నార గంటల్లోనే తిరుపతి చేరుకునే అవకాశం ఉంటుంది.
నర్సాపురం నుంచి చెన్నైకు ప్రస్తుతం వందేభారత్ నడుస్తోంది. బెంగళూరుకు కేటాయించాలనే వినతి మేరకు రైల్వే అధికారులు మే నెలలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా, కోచ్ లు సమస్య కారణంగా రైలు ఆలస్యం అయిందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ రైలు పట్టాలెక్కిచేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరు ప్రయాణం ఇతర రైళ్ల కంటే 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 AC చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ ఉండనున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది.

కాగా, ఈ రైలుకు నెంబర్ తో పాటుగా రూట్.. షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ ట్రైన్ (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుతుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి, కృష్ణరాజపురం 14.58, కాట్పాడి 17.23, చిత్తూరు 17.49, తిరుపతి 18.55, నెల్లూరు 20.18, ఒంగోలు 21.29, తెనాలి 22.42, విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు అందు బాటులోకి రావటం ద్వారా తిరుపతి.. బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుంది. అయితే, ఈ రైలును త్వరగా ప్రారంభించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి లావు శ్రీకృష్ణదేవరాయలు మూడు కీలక ప్రతిపాదనలు చేశారు. 'విజయవాడ నుంచి వేలాది మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు నిత్యం బెంగళూరుకు ప్రయాణిస్తుంటారు. విజయవాడ-బెంగళూరు మధ్య ప్రస్తుతం పరిమిత రవాణా సౌకర్యాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాల మధ్య తక్షణమే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రారంభించాలి. పల్నాడు ప్రాంతంలోని సిమెంట్, సున్నపురాయి, వ్యవసాయ మరియు లాజిస్టిక్స్ రంగాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే పోర్టుతో అనుసంధానం ముఖ్యం. అందుకే పిడుగురాళ్ల జంక్షన్ నుంచి రామాయపట్నం పోర్టు వరకూ కొత్త రైల్వేలైన్ నిర్మించాలి. నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20701), సికింద్రాబాద్-తిరుపతి, లింగంపల్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్(12796) రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలి' అని ఎంపీ విజ్ఞప్తి చేశారు. తాను చేసిన విన్నపాలపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. దీంతో, త్వరలో ఇవి కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications