ప్లే ఆఫ్స్ ముగింట్లో పల్టీలు
ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ మరో పరాజయాన్ని చవి చూసింది. సోమవారం రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. ప్లేఆఫ్స్ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్ లల్లో ఓడిపోవడం అంటే మాటలు కాదు. ఈ ఓటమి దెబ్బకు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దిగజారింది.
టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (33 బంతుల్లో ఆరు సిక్సర్లు, రెండు ఫోర్లతో 56), శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో మూడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 59 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 18 పరుగులే చేసి మరోసారి నిరాశపరిచాడు.

211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే తడబడింది. కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్‌తో పాటు సాహిల్ పారాఖ్, ట్రిస్టన్ స్టబ్స్ కూడా తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో అక్షర్ పటేల్ 30 బంతుల్లో 56 పరుగులతో జట్టును నిలబెట్టాడు. అనంతరం డేవిడ్ మిల్లర్ కేవలం 28 బంతుల్లో 51 పరుగులు చేసి 4 సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
మిల్లర్ తర్వాత ఆశుతోష్ శర్మ 10 బంతుల్లో 24, మాధవ్ తివారీ 8 బంతుల్లో 18, అకిబ్ 2 బంతుల్లో 10 పరుగులు చేసి ఢిల్లీకి చివరి ఓవర్‌లో విజయాన్ని అందించారు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ ప్రయాణం ఆందోళనకరంగా మారింది. సీజన్ ఆరంభంలో అద్భుతమైన ప్రదర్శనతో తిరుగులేని శక్తిగా కనిపించిన ఈ జట్టు ఇప్పుడు వరుస ఓటములతో సతమతమవుతోంది.
తొలి ఏడు మ్యాచ్‌లలో 13 పాయింట్లు సాధించి పటిష్టంగా నిలిచిన పంజాబ్, ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ఈ ప్రతికూల ఫలితాలపై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలవడానికి 210 పరుగులు సరిపోతాయని, ఇంత భారీ స్కోర్ ను కూడా కాపాడుకోలేకపోవడం నిరాశకు గురి చేసిందనీ అన్నాడు. ఇంకో 30 పరుగుల ఎక్కువగా చేసి ఉండొచ్చని పేర్కొన్నాడు.
యుజ్వేంద్ర చాహల్ జట్టులో ఉన్నా, అతనికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. ఈ నిర్ణయంపై కెప్టెన్ అయ్యర్ స్పందించాడు. బంతి సీమ్ అవుతోండటం, పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో యుజ్వేంద్ర చాహల్ కు బౌలింగ్ ఇవ్వలేదని వివరించాడు. పేస్ బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఉంటే వికెట్లు తీయగలిగేవారుని, వారి వైఫల్యం కారణంగానే మ్యాచ్ ఓడిపోయామని తేల్చి చెప్పాడు అయ్యర్. పేసర్ల ప్రదర్శనపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.
ధర్మశాల స్టేడియంలో ఐపీఎల్ చరిత్రలో 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఇది మొదటిసారి. 2010లో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఇప్పుడు దీన్ని ఢిల్లీ కేపిటల్స్ చెరిపేసింది. 211 పరుగులు చేసి ఈ రికార్డును బద్దలు కొట్టింది. మ్యాచ్ ను కాపాడుకోదగ్గ స్కోర్ ఉన్నప్పపటికీ పేలవమైన బౌలింగ్ ప్రదర్శనే పంజాబ్ ఓటమికి ప్రధాన కారణమని స్పష్టమౌతోంది.












Click it and Unblock the Notifications