ఔషధి ఎక్స్‌ప్రెస్.... హైదరాబాద్ నుండి ముంబైకి తొలి ప్రత్యేక ఫార్మసీ రైలు,ఫార్మాకి రెక్కలు!
భారతీయ రైల్వే రంగం ఔషధ రవాణా రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది. 'ఔషధి ఎక్స్‌ప్రెస్' పేరుతో దేశంలోనే తొలి ప్రత్యేక ఫార్మసీ రైలును హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు వరకు మే 2న ప్రారంభించి ఔషధ రవాణాలో కొత్త శకాన్ని సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని పీఎం గతిశక్తి పథకంలో భాగంగా జరిగింది.
హైదరాబాద్ నుండి ఔషధీ ఎక్స్ప్రెస్ రైలు
హైదరాబాద్‌ను ఫార్మా హబ్ గా, భారత ఫార్మా రాజధానిగా గుర్తించడం జరిగింది. ఇక్కడి వందలాది ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉత్పత్తి చేసే మందులను సురక్షితంగా, వేగంగా విదేశాలకు ఎగుమతి చేయడానికి ఈ ఔషధీ ఎక్స్ప్రెస్ రైలు బాట వేసింది. సాధారణ రవాణా పద్ధతుల్లో ఉష్ణోగ్రత మార్పులు, ఆలస్యాలు వంటి సమస్యలు తరచూ ఎదురవుతాయి.

హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ ఎగుమతులు
అయితే ఔషధి ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు ఉంటాయి. ఇది మందుల నాణ్యతను కాపాడుతూ, నిర్ణీత ఉష్ణోగ్రతలో రవాణా చేయడానికి సహాయపడుతుంది. ఈ రైలు ప్రారంభం ద్వారా హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. రోడ్డు మార్గంలో జరిగే రవాణాలో ట్రాఫిక్, వాతావరణ పరిస్థితుల కారణంగా జాప్యం ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.
ప్రపంచ మార్కెట్‌లో భారతీయ ఔషధాలు
రైలు రవాణా ఖర్చు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. ఫలితంగా భారతీయ ఔషధాలు ప్రపంచ మార్కెట్‌లో మరింత పోటీ సామర్థ్యం పొందుతాయి. ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ చారిత్రక సంఘటనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
రైలు కాదు, తెలంగాణ ఫార్మా రంగానికి లైఫ్ లైన్
"ఇది కేవలం రైలు కాదు, తెలంగాణ ఫార్మా రంగానికి లైఫ్ లైన్" అని ఆయన వ్యాఖ్యానించారు. దీని ద్వారా మందులు సరైన సమయంలో, సరైన నాణ్యతతో గమ్యస్థానాలకు చేరుతాయని, దీని ద్వారా భారతదేశం వాణిజ్య రవాణా రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తోందని అన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఇలాంటి ప్రత్యేక రైళ్లను విస్తరించాలని ఆయన సూచించారు.
రైల్వే వస్తు రవాణా రంగంలో కూడా ఆధునిక సాంకేతికత
భారతీయ రైల్వే ఇప్పటికే ప్రయాణికుల సౌకర్యాల్లో అనేక మార్పులు తీసుకువస్తోంది. ఇప్పుడు వస్తు రవాణా రంగంలో కూడా ఆధునిక సాంకేతికతను అమలు చేస్తోంది. ఔషధి ఎక్స్‌ప్రెస్ దీనికి ఒక చక్కని ఉదాహరణ. ఫార్మా రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రైలు ద్వారా ఎగుమతులు పెరిగితే విదేశీ మారకపు నిల్వలు మెరుగుపడతాయి.
హైదరాబాద్ ఫార్మా హబ్‌గా మరింత బలపడేలా చర్యలు
ఈ కొత్త ఆవిష్కరణ ఫార్మా కంపెనీలు, రైల్వే శాఖ, ప్రభుత్వం మధ్య సమన్వయానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇటువంటి నిర్ణయాలు హైదరాబాద్ ఫార్మా హబ్‌గా మరింత బలపడేలా చేస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు దేశ వ్యాప్తంగా విస్తరించాలని నిపుణులు కోరుతున్నారు. ఔషధి ఎక్స్‌ప్రెస్ భారతదేశం యొక్క లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో పెంచుతుంది అని చెప్పడం నిర్వివాదాంశం.













Click it and Unblock the Notifications