హైదరాబాద్: కేంద్ర న్యాయ శాఖ మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయి. కాంగ్రెసు తెలంగాణ నేతలు కూడా ఆయనను నమ్ముతున్నట్లు లేదు. ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీ పావులు కదుపుతున్నారనే భావన బలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. శనివారం తెలంగాణ కాంగ్రెసు నాయకులు చేసిన వ్యాఖ్యలను చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. పిసిసి సమన్వయ కమిటీకి చైర్మన్ గా మొయిలీని వేయడాన్ని వారు తప్పు పడుతున్నారు. చైర్మన్ గా పిసిసి అధ్యక్షుడు ఉండాలనేది వారి వాదన. అందువల్ల పిసిసి అధ్యక్షుడైన డి. శ్రీనివాస్ ను సమన్వయ కమిటీ చైర్మన్ గా నియమించాలని భావిస్తున్నారు. వీరప్ప మొయిలీ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం వల్లనే వారు ఆ వాదనను ముందుకు తెస్తున్నట్లు తెలుస్తోంది. వీరప్ప మొయిలీని సమన్వయ కమిటీ చైర్మన్ గా తప్పించాలని కాంగ్రెసు తెలంగాణ నేతలు ముక్కకంఠంతో శనివారం కోరారు.
అదే విధంగా సమన్వయ కమిటీలో వైయస్ జగన్, కెవిపిని వేయడం తెలంగాణకు సంబంధించి పార్లమెంటు సభ్యులను వేయకపోడం కూడా వారి అసంతృప్తికి కారణంగా ఉంది. సమైక్యాంధ్రవాదులు సమన్వయ కమిటీలో బలంగా ఉండేలా చూశారని వారంటున్నారు. సమన్వయ కమిటీలో తెలంగాణ నుంచి ఉన్న గీతారెడ్డి పెద్దగా గొంతు విప్పలేరనే వాదన కూడా ఉంది. కానీ ఈ విషయాలను వారు మాట్లాడడం లేదు. వీరప్ప మొయిలీ సీమాంధ్ర నాయకులకు, ముఖ్యంగా వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయి. నిజానికి, వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది మొదటి నుంచీ ఆయన వాదనగా తెలుస్తోంది. కానీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆలోచన మరో రకంగా ఉండడం వల్లనే ఆయన ఆలోచనలు ఆచరణకు రాలేదని అంటున్నారు. ఈ రకంగా కూడా మొయిలీ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశాలున్నట్లు వారు భావిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి