న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితిపై వేసిన శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై తాను కేంద్ర మంత్రులు పి. చిదంబరంతోనూ న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీతోనూ మాట్లాడలేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో కూడా తాను వాటి గురించి మాట్లాడలేదని ఆయన చెప్పారు. తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు పి. చిదంబరం, న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీలతో సమావేశమైన తర్వాత ఆయన శుక్రవారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కమిటీ విధివిధానాలు త్వరలోనే ఖరారవుతాయని ఆయన చెప్పారు. కమిటీ చైర్మన్ గా తాను ఎవరి పేరునూ సూచించలేదని, అలా సూచించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసినందున రాష్ట్రంలో శాంతికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పిల్లల చదువులకు ఆటంకాలు వద్దని ఆయన అన్నారు. ఏ పేరుతో ఎక్కడ ఉద్యమం జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు గండి పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని, కాంగ్రెసు నాయకత్వం అందుకు తగిన సమయం వచ్చిందని అనుకున్నప్పుడు అది జరుగుతుందని ఆయన అన్నారు. తాను అవసరం ఉందని అనుకున్నప్పుడు నాయకత్వాన్ని అడిగి అందుకు చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీని వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో వేసిన కమిటీ అవసరం ఉందా, లేదా పరిశీలిస్తామని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి