చిత్తూరు: తమ పార్టీ శాసనసభ్యుడు, అదుర్స్ చిత్ర నిర్మాత కొడాలి నాని ప్రకటనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాని చేసిన ప్రకటన సరైంది కాదని ఆయన అన్నారు. నాని సంయమనం పాటించాల్సి ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన రెండో రోజు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్ర తనకు రెండు కళ్ల లాంటివని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను తాను అర్థం చేసుకున్నానని ఆయన అన్నారు.
ధరల నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కేంద్ర వైఖరి ఉందని ఆయన విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వానికి సరైన అవగాన లేదని, అందుకే కోర్టులో చుక్కెదురైందని ఆయన అన్నారు. ఆయన కుప్పంలో ప్రజలను పలకరించారు. పొలాలను పరిశీలించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి