హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావును తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కలెక్షన్ కింగ్ గా అభివర్ణించారు. కెవిపి రామచందర్ రావుపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. కలెక్షన్ చేసి ఇస్తే కాంగ్రెసు పార్టీకి కెవిపి పిల్లర్ కాక ఏమవుతారని ఆయన అడిగారు. ప్రజా భద్రతా కమిటీ చైర్మన్ గా రామచందర్ రావు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలు కాపాడలేకపోయారని ఆయన అన్నారు. ప్రజా భద్రత కమిటీ చైర్మన్ గా కెవిపికి ఉన్న అర్హతమేటని ఆయన ప్రశ్నించారు. కెవిపి రామచందర్ రావుకు దుబాయ్ డబ్బు ఎలా వచ్చిందని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమత్రి కాక ముందు కెవిపి సీనేమిటని ఆయన అడిగారు. వైయస్ ముఖ్యమంత్రి కాకపోతే కెవిపిని ఎవరూ గుర్తు పట్టేవారు కాదని ఆయన అన్నారు.
కెవిపి రామచందర్ రావు తెలంగాణ భూములను స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ భూముల మీద, ప్రాజెక్టుల మీద కెవిపి ఎంత మింగారో బయటపడాలని ఆయన అన్నారు. తన కుమారుడి మామ సంపన్నుడని కెవిపి అంటున్నారని, తమ నేత చంద్రబాబు మామ ధనవంతులు కారా అని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల కోసం చూస్తున్నామని, కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. శాసనసభను బహిష్కరిస్తాం లేదా అడ్డుకుంటామని ఆయన చెప్పారు. ఏం చేయాలనే విషయంపై జెఎసిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి