విశాఖపట్నం: సీమాంధ్ర విశ్వవిద్యాలయాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో జరిగే విద్యార్థి సదస్సుకు విశాఖ వేదిక కానుంది. రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సదస్సుకు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ (కాంగ్రెసు), పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు (టీడీపీ), పొలిట్‌బ్యూరో సభ్యుడు, అనకాపల్లి శాసనసభ్యుడు (పీఆర్‌పీ) గంటా శ్రీనివాసరావు తదితర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. తొలుత మధ్యాహ్నం 12 గంటలకు టైకూన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో లగడపాటి రాజగోపాల్ పాల్గొంటున్నారు.
అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు గురజాడ కళాక్షేత్రంలో విద్యార్థి సదస్సు ప్రారంభమవుతుంది. రెండు గంటల పాటు ఇది జరుగుతుంది. సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు తరలి రానున్నారు. వీరేకాకుండా సమైక్యాంధ్ర అనుకూలవాదులూ హాజరవుతున్నారు. సమైక్యాంధ్ర భవిష్యత్తు ప్రణాళిక, ఉద్యమం బలోపేతానికి అవ సరమైన శక్తుల సమీకరణ వంటి అంశాలను ఈ సదస్సులో చర్చించి తీర్మానాలను ఆమోదిస్తారు. సమైక్యాంధ్ర ఆవ శ్యకతపై గళం విప్పనున్న ఈ సదస్సుకు పోలీసులు భద్రతా చర్యలు తీసుకొంటున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి