హైదరాబాద్: తెలంగాణ విద్యార్థుల జెఎసి రేపు శనివారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చట్టవిరుద్దమని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు హైదరాబాదు వచ్చి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దని, ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లాల నుంచి విద్యార్థులెవరూ హైదరాబాద్ రావద్దని ఆయన సూచించారు. చలో అసెంబ్లీ కార్యక్రమం గురించి మాట్లాడడానికి తమ వద్దకు ఎవరూ రాలేదని, విద్యార్థుల కార్యక్రమేమిటో కూడా తమకు తెలియదని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన చలో అసెంబ్లీ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎనిమిది మంది ఐజిలను, 20 మంది డిఐజిలను నియోగించినట్లు ఆయన చెప్పారు. రేపు ట్రాఫిక్ ఆంక్షలకు హైదరాబాదు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిస్టులపై జరిగిన దాడులకు నిరసనగా జర్నలిస్టులు ఎకె ఖాన్ మీడియా సమావేశాన్ని కింద కూర్చుని కవర్ చేసి తమ నిరననను తెలియజేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి