హైదరాబాద్: అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన కడప ఎరువు ఫ్యాక్టరీతో సహా రాష్ట్రంలోని 13 ఎరువుల కంపెనీల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. కడప మార్క్ ఫెడ్ ఎరువుల కుంభకోణంపై శుక్రవారం శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగిన నేపథ్యంలో ఆయన ఈ విషయం చెప్పారు. అధికార కాంగ్రెసు సభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డితో పాటు తెలుగుదేశం సభ్యులు కడప మార్క్ ఫెడ్ అక్రమాలపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అందుకు అంగీకరించకుండా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి హామీతో తెలుగుదేశం సభ్యులు సంతృప్తి చెందలేదు. సభా సంఘం వేయాలని పట్టుబడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను మూడోసారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతకు ముందు రెండుసార్లు కూడా సభను డిప్యూటీ స్పీకర్ రెండు సార్లు వాయిదా వేశారు. మొదటి సారి యూరియా ధరల పెంపుపై సభను పది నిమిషాలు వాయిదా వేశారు. రెండో సారి కడప మార్క్ ఫెడ్ కుంభకోణంపై గందరగోళం చెలరేగడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి