న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ తన పనిని ప్రారంభించింది. ఈ మేరకు కమిటీ రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. ఈ నెల 25వ తేదీన తిరిగి సమావేశం కావడానికి ముందే తన కార్యాచరణపై వేగంగా ముందుకు కదిలింది. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, ప్రజారాజ్యం పార్టీ అధినేత కె. చిరంజీవి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసిలకు కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ లేఖలు రాశారు. ఈ నెల 20వ తేదీన అన్ని పత్రికల్లో కమిటీ ప్రకటన ప్రచురితమవుతుందని, అందులోని విధివిధానాల ప్రకారం సమాధానాలు రాయాలని దుగ్దల్ రాజకీయ పార్టీలకు తెలియజేసింది.
సంప్రదింపులకు ముందు కమిటీ సమాచార సేకరణ జరపాలని అనుకుంటోంది. వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించిన తర్వాత చర్చల ప్రక్రియను ప్రారంభిస్తే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయంతో కమిటీ ఉంది. సంప్రదింపుల్లో విధివిధానాల్లో పేర్కొన్న అన్ని వర్గాలుంటాయి. పరిశోధన, సమాచార సేకరణ, సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక తయారీకి పూనుకోవాలని కమిటీ అనుకుంటోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి