న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మొదటి నుంచీ తప్పులు చేస్తూ వస్తున్నారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. ఎన్ని సార్లు రాజీనామాలు చేస్తారని ఆయన అడిగారు. రాజీనామాలు చేయడం వల్ల తెలంగాణ రాదని, కెసిఆర్ రాజీనామాల ఎజెండా తప్పని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజీనామాల వల్ల తెలంగాణ వచ్చిందా, రాలేదని ఆయన అన్నారు. కాంగ్రెసుతోనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆయన అన్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందనేది పొరపాటని, రాజీనామాల వల్ల రాష్ట్రపతి పాలన వస్తుందని, అప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఉండదని, తమ వాదనలను వినేవారు కూడా ఉండరని ఆయన అన్నారు. కెసిఆర్ తనకు మంచి మిత్రుడని, ఉద్యమాలు ఎవరైనా చేస్తారని, ఫలితం రావడం ముఖ్యమని ఆయన అన్నారు.
సమైక్యాంధ్రవాదులు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు వాదనలు వినిపించడానికి సిద్ధమవుతున్నారని, తెలంగాణవారు కూడా తమ వాదనలను గట్టిగా వినిపించడానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. కమిటీ వల్ల తప్పకుండా తెలంగాణకు న్యాయం జరుగుతుందని, గడువులోగానే శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నాయకులు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు వినిపించాల్సిన వాదనల గురించి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వివిధ రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో, సోదాహరణంగా కమిటీకి వినిపించవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణవాళ్లమంతా ఒక్క మాటగా కమిటీకి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వినిపిద్దామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం జరిగిన ఒప్పందాలన్నీ ఉల్లంఘనలకు గురయ్యాయని, ఆ విషయాలను కమిటీకి వివరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి