హైదరాబాద్: పార్లమెంటు ఉభయ సభల్లో మమతా బెనర్జీ బుధవారం ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిప్పులు చెరిగారు. మమతా బెనర్జీ ప్రతిపాదనలు నమ్మశక్యంగా లేవని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మమతా బెనర్జీ ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు తలాతోక లేకుండా ఉన్నాయని ఆయన అన్నారు. పెద్దపల్లి - నిజమాబాద్ రైల్వే లైన్ కు నిధులు పెంచాల్సి ఉండిందని ఆయన అన్నారు. నిజామాబాద్ - రామగుండం రైల్వే లైన్ ప్రతిపాదనకు అర్థం లేదని, రామంగుండానికి ఇప్పటికే వివిధ చోట్ల నుంచి రైలు మార్గాలు కలిపి ఉన్నాయని ఆయన అన్నారు.
వరంగల్ జిల్లాలోని ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని తాము అడుగుతుంటే మమతా బెనర్జీ దాన్ని పశ్చిమ బెంగాల్ కు తరలించుకుపోయారని ఆయన అన్నారు. గతంలో సికింద్రాబాదుకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తే అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాన్ని బీహార్ కు తరలించుకుపోయారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయే చూపుతున్నారని ఆయన విమర్శించారు. సికింద్రాబాదులో ఉన్నది రైల్వే కోచ్ ల వర్క్ షాపు అని, దాన్ని ఇప్పటికే సగం మూసేశారని, ఇప్పుడు దాన్ని పునరుద్ధరిస్తామంటున్నారని, అది కూడా వ్యాగన్ల ఫ్యాక్టరీ కాదని, కేంద్రం మాత్రమేనని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి