హైదరాబాద్: తెలంగాణ ప్రజలను కాంగ్రెసు నట్టేట ముంచిందని తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. జెఎసి సమావేశానంతరం ఆయన మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జెఎసి నుంచి కాంగ్రెసును వెళ్లిపోవాలని ఎవరూ అడగలేదని, అందరినీ రమ్మని చెప్పి ఆ పార్టీయే వెళ్లిపోయిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ రాజీనామాలు, భవిష్యత్తు కార్యాచరణపై పూర్తి స్థాయిలో సమీక్షించేందుకు మరో రెండు రోజుల్లో సమావేశమవుతామని ఆయన చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్న తెలంగాణవాదులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఆయన ఖండించారు. మంత్రి సంజాయిషీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చే వరకు పదవులు తీసుకోమని చెప్పిన మంత్రి ఇప్పుడు రాజీనామా చేయడం లేదని, రాజీనామాల విషయంలో కాంగ్రెసు తెలంగాణ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
రాజీనామాలు చేయాలని జెఎసి ప్రజా సంఘాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను సమావేశంలో డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు రాజీనామాలు చేస్తే కాంగ్రెసువారిపై ఒత్తిడి పెంచడానికి వీలవుతుందని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెసేతర పార్టీలు రాజీనామాలు చేస్తే 52 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని, దీని ద్వారా రాజ్యాంగ సంక్షోభం కాకపోయినా రాజకీయ సంక్షోభం సృష్టించవచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే జెఎసి గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాజీనామాలకు కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను ఒప్పించాలని తెలుగుదేశం ప్రతినిధులు చెప్పారు. తాము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. కాంగ్రెసు రాజీనామాలు చేయకుండా తాము చేస్తే ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయని, రాజకీయ సంక్షోభం ఏర్పడదని, దాని వల్ల ఫలితం ఉండదని వారన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి