హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్తు, వ్యవసాయ కరెంటు కనెక్షన్లపై బుధవారం శాసనసభలో తీవ్ర రగడ జరిగింది. రైతులకు రోజుకు 9 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తామని కాంగ్రెసు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై తెలుగుదేశం సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరాపై ప్రభుత్వం మాట తప్పిందని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా నిరసించారు. వ్యవసాయానికి రోజుకు 9 గంటల పాటు విద్యుత్తును సరఫరా చేయాలని చంద్రబాబు కోరారు. వ్యవసాయానికి రోజుకు 9 గంటల పాటు విద్యుత్తును ఇస్తామని కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి