ఇచ్చాపురంలో వైఎస్ స్మృతి చిహ్నానికి గ్రహణం

రెండెకరాల స్థలంలో ఎస్సీ కార్పొరేషన్ పర్యవేక్షణలో పార్కు నిర్మాణ పనులు ప్రారంభించారు. రెండు విడతలుగా సుమారు రూ.59లక్షలతో పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా ఎంట్రన్స్‌ప్లాజా, కాంపౌండ్‌వాల్, ఓపెన్ ఎయిర్ థియేటర్, కాలిబాటలు, ఒక భవనం నిర్మించి రెండు బోర్లు తీయించారు. పచ్చికబయళ్లు, అందమైన వివిధ జాతుల మొక్కలు ఏర్పాటుచేశారు. అయితే టూరిజం పార్కును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలంటే క్యాంటిన్, టాయిలెట్ల బ్లాక్, ఫౌంటేన్, ఆటవస్తువులు, ఇతర వసతులు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం సుమారు రూ.60 లక్షల నిధులు విడుదల కావాల్సి ఉన్నాయి. ఈ టూరిజం పార్కును 2008, అక్టోబర్ 26న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయస్థూపాన్ని తనవితీరా చూసుకుని వైఎస్ ఉద్వేగానికి లోనుకావడం నేటికీ ఎవరూ మర్చిపోలేరు. ఈ టూరిజం పార్కుకు 'వైఎస్ ప్రజాప్రస్థాన విజయవాటిక' అని పేరు పెట్టారు. టూరిజం పార్కు అభివృద్ధికి కలెక్టర్ శ్రీకాంత్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి పలు సూచనలు చేశారు.
ప్రజాప్రస్థాన విజయవాటిక నిర్వహణ చేపట్టాలని ఇచ్ఛాపురం మున్సిపాలిటీకి కలెక్టర్ సూచించినా ఫలితం లేకపోయింది. మున్సిపాల్టీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నందున నిర్వహించలేమంటూ కౌన్సిల్ తీర్మానం చేసింది. దీంతో ఆలనాపాలనా చూసేవారు లేక మహానేత మధురస్మృతి నేడు అనాథగా మారింది. టూరిజం పార్కు గేటుకు కనీసం తాళాలు కూడా లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్కులో పేరుకుపోయిన చెత్తను ఊడ్చే నాథుడే లేడు. సంరక్షించేవారు లేక లక్షల రూపాయల ఖర్చుతో నాటిన మొక్కలు మోడుబారిపోతున్నాయి. ఆవులు, మేకలు, ఇతర జంతువులు పార్కులో స్వేచ్ఛగా తిరుగుతూ వాటిని తినేస్తున్నాయి. పార్కులో ఏర్పాటుచేసిన లైట్లు శిథిలమైపోయాయి. ఓపెన్ ఎయిర్ థియేటర్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి.