హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వినోద్ కె. దుగ్గల్ తాజా ప్రకటనతో ఇరకాటంలో పడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం పార్టీ తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు. విభజనపై పార్టీ వైఖరి వెల్లడించాలని, ఏదో ఒక వైఖరిని స్పష్టంగా చెప్పాలని ఆయన అన్నారు. పార్టీ వైఖరి మాత్రమే చెప్పాలని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గురువారం కూడా చెప్పింది. రెండు ప్రాంతాలు తనకు రెండు కళ్లు అంటూ ఇరు ప్రాంతాల నాయకులను రెచ్చగొట్టి తన వైఖరిని ప్రకటించకుండా మౌనం వహించిన చంద్రబాబు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. శ్రీకృష్ణ కమిటీకి స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సి రావడంతో ఆయన తెలంగాణ నాయకులతో చర్చలు జరుపుతున్నారు.
శ్రీకృష్ణ కమిటీకి చెప్పాల్సిన అభిప్రాయంపై, సమర్పించాల్సిన నివేదికపై ఆయన తెలంగాణ నాయకులతో చర్చలు జరిపారు. నెలలోగా రాష్ట్రంలోని ఎనిమిది గుర్తింపు పొందిన పార్టీలు తమ వైఖరిని కమిటీ ముందు పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి చంద్రబాబు పూర్తిగా కట్టుబడే పరిస్థితి లేదు. ఆ నిర్ణయాన్ని పార్టీ సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇటు తెలంగాణకు వ్యతిరేకంగా కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించే పరిస్థితిలో చంద్రబాబు లేరు. రెండు ప్రాంతాలు తనకు రెండు కళ్లు అంటూ తప్పించుకోవడానికి వీలు లేకుండా శ్రీకృష్ణ కమిటీ మెలిక పెట్టింది. దీంతో చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు మొదలు పెట్టారని భావించవచ్చు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి