దుగ్దల్ ప్రకటనతో చంద్రబాబుకు చిక్కులు

చంద్రబాబుకు ఇప్పటికే తెలంగాణ నాయకులు కాస్తా దూరమైనట్లు తెలుస్తోంది. శాసనసభలో వ్యవహరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ నాయకులు డుమ్మా కొట్టారు. దీంతో ఆయన తెలంగాణ నాయకులపై గుర్రుమన్నట్లు సమాచారం. పార్టీపరంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ సీమాంధ్రవైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ ముందు కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాల్సి రావడం వల్ల ఆయన రంగు బయట పడుతుందని అంటున్నారు. అయితే వ్యూహరచనలో దిట్ట అయిన ఆయన సమయానికి ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా చెప్పలేమని అంటున్నారు. ఏదో ఒక సాకుతో ఆయన శ్రీకృష్ణ కమిటీని బహిష్కరించే ఎత్తుగడను ఆయన ఎంచుకోవచ్చునని అంటున్నారు. అయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఎన్నికల ప్రణాళికలను కమిటీ పరిగణనలోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని ఒక అభిప్రాయం.
కాగా, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణకు ప్రజారాజ్యం ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే తెలంగాణ నుంచి ఎన్నికైన ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు చిరంజీవి వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. వారు విడిగా శ్రీకృష్ణ కమిటీ ముందు తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని చిరంజీవి కాదనండ ఎటు వైపు దారి తీస్తుందో కూడా చెప్పలేమంటున్నారు.
నిజానికి, చంద్రబాబు కాంగ్రెసు విషయంలో తప్పు అంచనాతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, సమైక్యాంధ్రల విషయంలో కాంగ్రెసు పార్టీ తేల్చుకోలేదనేది ఆయన అంచనా. కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కాంగ్రెసు పార్టీ నిర్ణయంగా ఉంటుంది. ప్రభుత్వం తమదే కాబట్టి కాంగ్రెసుకు ఆ విషయంలో ఇబ్బంది ఏర్పడకపోవచ్చు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ విషయంలో తన వైఖరి వెల్లడించాలనే తెలుగుదేశం పార్టీ నాయకుల డిమాండ్ కూడా ఎదురు తిరిగే అవకాశం లేకపోలేదు.