న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ గురువారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలుసుకున్నారు. రాష్ట్ర పరిస్థితిపై ఆయన ప్రధానికి ఒక నివేదికను సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత స్థితిపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడుతున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ వెనక్కి పోవడం లేదని ఆయన చెప్పారు. గత 90 రోజుల రాష్ట్ర పరిస్థితపై ఆయన ప్రధానికి వివరించినట్లు సమాచారం.
కేంద్ర మంత్రి బన్సల్ ను కూడా ఆయన కలుసుకున్నారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఆయన బన్సల్ ను కోరినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం నరసింహన్ ఢిల్లీ వచ్చారు. రాష్ట్ర స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ హైదరాబాదుకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో ప్రధానితో నరసింహన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్ మరింత మందిని కలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి