హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితిపై ఏర్పాటైన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి పార్టీపరంగా నివేదిక సమర్పించాల్సి వస్తే ఆ విషయాన్ని తమ అధిష్టానమే చూసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. పార్టీలు తమ అభిప్రాయాలను కచ్చితంగా తమకు చెప్పాల్సిందేనని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ చెప్పిన నేపథ్యంలో డి శ్రీనివాస్ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బడ్జెట్ కేటాయింపుల విషయంలో తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు ముఖ్యమంత్రి కె రోశయ్యకు లేఖ రాయడం సముచితమేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
కాగా, తెలంగాణపై తమ పార్టీకి స్పష్టత ఉందని కాంగ్రెసు తెలంగాణ కార్యాచరణ కమిటీ చైర్మన్, శాసనసభ్యుడు బస్వరాజు సారయ్య అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి తమ పార్టీ తెలంగాణకు అనుకూలమైన నిర్ణయాన్ని వెల్లడిస్తుందనే ఆశాభావం తమకు ఉందని ఆయన గురువారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీ నాయకత్వం తెంలగాణకు అనుకూలంగా ఉంది కాబట్టే డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన వచ్చిందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి తాము 15 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టే ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నామని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి