మార్చి మొదట్లో రాష్ట్రానికి శ్రీకృష్ణ కమిటీ

ప్రాథమిక సంప్రదింపులు ప్రారంభిస్తామని, తమకు పెద్ద యెత్తున ఆర్జీలు వస్తున్నాయని, వాటిలోని అంశాలను విశ్లేషిస్తామని ఆయన చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను రెండు నెలల పాటు క్షుణ్నంగా పరిశీలిస్తామని చెప్పారు. కమిటీ తదుపరి సమావేశం హైదరాబాద్ లో ఉంటుందని చెప్పారు. కమిటీ తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తుందని ఆనయ చెప్పారు.కాగా, కమిటీ దఫాల వారీగా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తుది నివేదికను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రూపొందించే లక్ష్యంతో కమిటీ పనిచేస్తున్నట్లు సమాచారం.
కాగా, కమిటీ సభ్యుల మధ్య పని విభజన కూడా జరిగినట్లు చేస్తుంది. వికె దుగ్గల్, రణబీర్ సింగ్ రాజకీయ, చారిత్రక, పరిపాలన, న్యాయపరమైన అంశాలపై అధ్యయనం చేస్తారు. సలే, రవీందర్ కౌర్ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై అధ్యయనం చేస్తారు. తమకు అభిప్రాయాలు తెలియజేయాలని కమిటీ రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలకు లేఖలు రాసింది. పార్టీ అధ్యక్షుల అభిప్రాయం మాత్రమే వెల్లడించాలని కమిటీ స్పష్టం చేసింది. పార్టీ రాష్ట్ర శాఖలు అభిప్రాయం చెబుతాయా, అధిష్టానాలు చెబుతాయా అనేది ఆయా పార్టీల ఇష్టానికే వదిలేసినట్లు కమిటీ తెలిపింది.