రైల్వే బడ్జెట్ లో విశాఖపట్నానికి అన్యాయం

విశాఖ రైల్వే ఆస్పత్రి స్థాయి పెంపు మినహా ఒరిగిందేమీ లేదు. డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఆదాయంలో వాల్తేరు డివిజన్ ప్రథమ స్థానంలో ఉంది. అయినా మమతా బడ్జెట్ నిరాశే మిగిల్చింది. ప్రత్యేక జోన్ గా ఏర్పాటు లేదా దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు ఈసారీ చుక్కెదురైంది. విశాఖ రైల్వే స్టేషన్ ను అత్యాధునిక హంగులతో టెర్మినల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలన్న రైల్వే ఉన్నతాధికారుల ప్రతిపాదనలూ ఆమోదానికి నోచుకోలేదు.
గత బడ్జెట్ లో కేటాయించిన విశాఖ-ముంబయి నూతన రైలు వెంటనే పట్టాలెక్కే అంశం ఈ బడ్జెట్‌లో చోటుచేసుకుంటుందన్న ఆశలు కూడా నెరవేరలేదు. అరకులోయ అందాలను వీక్షించేందుకు కిరండూల్ మార్గాన్ని డబ్లింగ్ చేసే విషయాన్నీ పరిగణనలోకి తీసుకోలేదు. విశాఖ-చెన్నై/పాండిచ్చేరి మధ్య వారంలో రెండు రోజులు, విశాఖ-షిరిడీ మధ్య వారానికి రెండు రోజులు నడిచే రైళ్లు వస్తాయని ఆశించినా బడ్జెట్‌లో మంజూరు కాలేదు.
ప్రస్తుతం విశాఖ-షిర్డీకి నడుస్తున్న ప్రత్యేక రైలును శాశ్వత ప్రాతిపదికన వారంలో రెండు రోజులు సూపర్‌ఫాస్ట్‌గా నడిపేందుకు రైల్వే అధికారులు చేసిన ప్రతిపాదనలూ బుట్టదాఖలయ్యాయి. దువ్వాడ మీదుగా తరలిపోతున్న రైళ్లను విశాఖ స్టేషన్‌కు రప్పించే ప్రయత్నమూ బెడిసికొట్టింది. ఒరిస్సా మీదుగా నడుస్తున్న నీలాచల్, ఉత్కల్, కళింగ, పురుషోత్తం వంటి ఎక్స్‌ప్రెస్‌లను విశాఖ వరకూ పొడిగించే విషయం స్ఫురణకే రాలేదు. విశాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు, ఖాళీ పోస్టుల భర్తీ...మరెన్నో రైల్వే ఉద్యోగుల డిమాండ్లు రైల్వేబడ్జెట్‌లో నెరవేరలేదు.