విజయవాడ: రాష్ట్ర విభజన జరిగితే మంచిదేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్రలో తీవ్ర వివాదం చెలరేగుతోంది. సీమాంధ్రలోని సమైక్యవాదులు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నారు. బొత్స సత్యనారాయణ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. బొత్స సత్యనారాయణపై రాయలసీమకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి ఆదివారం వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బొత్స స్ట్రాటజిస్టు అని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులు ఎర్రంనాయుడు, మైసురారెడ్డి వంటి నాయకులు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. లగడపాటి రాజగోపాల్ వంటి కాంగ్రెసు నాయకులు కూడా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను తప్పు పడుతున్నాడు.
సమైక్యవాదులు ఎంతగా వ్యతిరేకించినా బొత్స సత్యనారాయణ మాత్రం తన మాటను వెనక్కి తీసుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగితేనే మంచిదని ఆయన పదే పదే అంటున్నారు. ఆయన వ్యాఖ్యలను విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రం విడిపోవడం వల్ల కలిగే నష్టమేమిటో విద్యార్థులు వివరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అత్యంత కీలరమైన ప్రస్తుత సందర్భంలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సమైక్యవాదులను ఇరకాటంలో పడ్డాయి. కాగా, తెలంగాణ నాయకులంతా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే బొత్సకు సన్మానం చేస్తామని అంటున్నారు. ఉస్మానియా విద్యార్థులు బొత్స సత్యనారాయణకు ఫొటోకు పూలదండలు వేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి