వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికలు ఏకాభిప్రాయమే: పొన్నం ప్రభాకర్

By Santaram
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
కరీంనగర్‌: రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల స్థానాల్లో తిరిగి వారినే ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం కన్వీనర్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను నిలబెడతామని చేసిన ప్రకటనకు ఇది పూర్తి భిన్నం.

సోమవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఐదు శాసనసభనియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రానున్నాయని, తన పార్లమెంట్‌ పరిధిలో మూడు స్థానాలున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తమ పదవులను త్యాగం చేసినందున వారిని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆకాంక్షించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

ఉప ఎన్నికల్లో పోటీపై పార్టీ అధిష్టానం తనను సంప్రదిస్తే, వేములవాడ మినహా ఇతర చోట్ల పోటీచేయవద్దనే చెబుతానన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేయలేదన్నారు. కేవలం తాను చేసిన తప్పును తెలంగాణతో కప్పిపుచ్చుకొనే క్రమంలోనే పదవీ త్యాగం అంటున్నాడన్నారు.

పౌరసత్వం వివాదంలో తన పదవి పోవడం ఖాయమని తేలడ ంతోనే ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నాడన్నారు. తెలంగాణకు రమేశ్‌బాబు రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే తాము అక్కడ జరిగే ఉప ఎన్నికలో పోటీచేస్తామని ప్రభాకర్‌ వెల్లడించారు. సానుకూలంగా తెలంగాణను సాధించుకొనేందుకు అన్ని వర్గాలు సహకరించాలన్నారు. తెలంగాణ గొంతుకను శ్రీకృష్ణకమిటీ ముందు బలంగా వినిపించాలన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన లెక్కలను కమిటీ సేకరిస్తుందని ప్రభాకర్‌ చెప్పారు.

సమావేశంలో నగర మేయర్‌ డి.శంకర్‌, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌, పీసీసీ కార్యదర్శి వై.సునీల్‌ రావు, ఆకారపు భాస్కర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నగరశాఖ అధ్యక్షుడు కన్న కృష్ణ, డీసీసీ కార్యదర్శి పొన్నం సత్యం, డీవైసీసీ అధికార ప్రతినిధి మహేష్‌, నగర అధ్యక్షుడు వి.అంజన్‌కుమార్‌, శ్రీనివాస్‌, సర్పంచుల సంఘం గౌరవఅధ్యక్షుడు అంజనీప్రసాద్‌, సెన్సార్‌బోర్డు సభ్యుడు కటకం వెంకట రమణ, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మనోజ్‌, పాల్తెపు కిషన్‌, జమీల్‌, అంజయ్యయాదవ్‌, కార్పొరేటర్లు సదానందచారి, భూమయ్య పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X