ఆ ప్రమాదంతో రెండు గ్రామాల్లో విషాదం

మొక్కు తీర్చుకున్న అనంతరం సోమవారం మధ్యాహ్నం హరిబాబు, బడేవారిపాలెంలో ఉంటున్న అతని తల్లి రాజ్యలకి, పిట్టల్లంకలో ఉంటున్న చెల్లెలు కడవకొల్లు పద్మ, ఇద్దరు బావమరుదులు, చెల్లెళ్లు, వారి పిల్లలతో కలిపి మొత్తం 16మంది హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యంలో వీరు సాయంత్రం ఆరు గంటలకు పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే మూడు గంటలు గడిపారు. రాత్రి తొమ్మిది గంటలకు హైదరాబాద్ బయలుదేరారు. ఎదురుగా వస్తున్న లారీని ఓవర్‌టేక్ చేయ బోయి వెలిమినేడు శివారు ప్రాంతంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సుమో దానిని ఢీకొంది.
ఈ దుర్ఘటనలో హరిబాబు తల్లి రాజ్యలకి (55), భార్య ప్రసన్న (20), కుమార్తె సింధు (18నెలలు), చెల్లెలు పద్మ(33), బావమరుదులు కమ్మిలి సాంబశివరావు (40), వాడ శ్రీనివాసరావు(38), ఆయన కుమార్తె పూజ (8), బడేవారిపాలేనికి చెందిన వెంకట రమణ(25) మరణించారు. హరిబాబు చెల్లెళ్లు సువర్చల, సత్యవతి పరిస్థితి విషమంగా ఉంది.
తీవ్రంగా గాయపడిన మరో నలుగురు చిట్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాన్ని కమ్మిలి సాంబశివరావు నడుపుతున్నాడు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే పిట్టల్లంక, బడేవారిపాలెం గ్రామాల నుంచి మృతుల బంధువులు చిట్యాలకు తరలివెళ్లారు. రెండు రోజుల క్రితం అందరితో సంతోషంగా గడిపిన వీరంతా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రెండు గ్రామాల్లో విషాదం రాజ్యమేలుతోంది. హరిబాబు తండ్రి శేషగిరికి ఈ ప్రమాదం గురించి బంధువులు మంగళవారం సాయంత్రం వరకూ చెప్పలేదు. ఈ ఘటనతో బంధువులు కుమిలిపోతున్నారు.












Click it and Unblock the Notifications