హైదరాబాద్: హైదరాబాదులోని బేగంపేట ఏవియేషన్ షో ప్రారంభమైన కొద్ది సేపటికే విషాదం చోటు చేసుకుంది. ఇండియన్ నేవీకి చెందిన నాలుగు విమానాలు విన్యాసం చేస్తుండగా సూర్యకిరణ్ న్యూబోయిన్ పల్లిలోని జనావాసాల్లో కూలిపోయింది. ఈ దుర్షటనలో పైలట్ నాయర్ తో పాటు కోపైలట్ మౌర్య మరణించినట్లు సమాచారం. అయితే వారిద్దరిలో ఒకరు మరణించినట్లు మాత్రం నమ్ముతున్నారు. మరొకరు కూడా కోపైలట్ కావచ్చునని అంటున్నారు. పైలట్, కోపైలట్ మరణించినట్లు చెబుతున్నారు. అయితే వారి మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయని చెబుతున్నారు.
సాగర్ పవన్ విమాన విన్యాసాల్లో భాగంగా సూర్యకిరణ్ అనే ఓ యుద్ధ విమానం సెల్ టవర్ కు తగిలి అదుపు తప్పి న్యూబోయినపల్లిలోని ఆర్యసమాజ్ పక్కన ఉన్న మూడు అంతస్థుల భవనంపై కూలింది. భవనంలోని నలుగురు గాయపడ్డారు. వారిని యశోద ఆస్పత్రికి తరలించారు. భవంతి పైభాగం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పెద్ద యెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాద స్థలానికి పెద్ద యెత్తున ప్రజలు చేరుకుంటున్నారు. కేంద్ర పౌరవిమాన యాన మంత్రి ప్రఫుల్ పటేల ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.