హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి (పివో) సుదర్శన్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు బుధవారం ఏక కాలంలో దాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటలో గల ఆయన నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. అదే సమయంలో కృష్ణా జిల్లా గన్నవరం, హైదరాబాదుల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. సుదర్శన్ కు రెండు కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు ఈ సోదాల్లో బయట పడింది.
సుదర్శన్ కు హైదరాబాదులోని సింగపూర్ టౌన్ షిప్ లో 12 ఫ్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఆయన కృష్ణా జిల్లాలో పని చేశారు. ఆ సమయంలోనే ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు బయటపడడంతో సుదర్శన్ పై కేసు నమోదు చేసినట్లు ఎసిబి అధికారులు చెప్పారు.