సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ఎయిర్ పోర్ట్ ను తలదన్నేలా
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమందికి చిరపరిచితం. మొత్తం 10 ప్లాట్‌ఫామ్స్, 11 ట్రాక్స్ ఉన్న స్టేషన్ నుంచి నిత్యం 180 రైళ్లు దేశం నలుమూలలకూ రాకపోకలు సాగిస్తోంటాయి. రోజూ సగటున లక్షన్నర మంది ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలో అత్యధిక ఆదయాన్ని ఆర్జించే జోన్లల్లో ఒకటిగా ఉండే దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలకు విస్తరించిన ఈ అతిపెద్ద జోన్ ప్రధాన కార్యాలయం రైల్ నిలయం ఉండేది సికింద్రాబాద్‌లోనే.
వందే భారత్, రాజధాని, శతాబ్ది సహా అన్ని రకాల ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తోన్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, రైళ్లు, ప్లాట్ ఫామ్‌ల సంఖ్యకు అనుగుణంగా దీన్ని మరింత విస్తరిస్తోన్నారు. ఆధునికీకరిస్తోన్నారు. ఎయిర్‌పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల కింద కేంద్ర ప్రభుత్వం దీన్ని అత్యద్భుతంగా రూపుదిద్దుతోంది.

తెలంగాణలో- సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్, మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట్ జంక్షన్, మధిర.. వంటి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిల్లో కొన్ని స్టేషన్ల పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం 714. 73 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు కొనసాగుతున్నాయి. మూడు దశల్లో పూర్తి కానున్నాయి. వచ్చేే 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ తరహాలో ఈ స్టేషన్ పునర్నిర్మితం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయనే అంచనాలు ఉన్నాయి. ఇందులో 64 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
ఈ అభివృద్ధిలో భాగంగా నూతన ప్రతిష్టాత్మక స్టేషన్ భవనాలు, రెండు స్థాయిల ఎయిర్ కాన్‌కోర్స్, ప్లాట్‌ఫారాలపై కవర్ రూఫ్, మల్టీ లెవెల్ పార్కింగ్ వంటి ప్రధాన సౌకర్యాలు నిర్మాణంలో ఉన్నాయి. ప్రయాణీకుల సౌలభ్యం కోసం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. స్కైవాక్‌ల ద్వారా మెట్రో కనెక్టివిటీ, ఆధునిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్లాంట్, ఈవీ ఛార్జింగ్ వసతులు, సమగ్ర సీసీటీవీ భద్రతా వ్యవస్థలు కూడా అంతర్భాగం.
ప్రాజెక్టులో తాత్కాలిక బుకింగ్ కార్యాలయం, రైల్వే రక్షణ దళ భవనం, పాదచారుల వంతెనల నిర్మాణం, దక్షిణ వైపు అప్రోచ్ రోడ్డు వంటి కొన్ని పనులు పూర్తయ్యాయి. నూతన స్టేషన్ భవనాలు, ఎయిర్ కాన్‌కోర్స్, బహుళ స్థాయి పార్కింగ్, భూగర్భ నీటి ట్యాంకులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ సహా అనేక కీలక పనులు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి. మెట్రో స్టేషన్‌లను కలిపే స్కైవాక్ నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.












Click it and Unblock the Notifications