హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ విప్ శైలజానాథ్ విమర్శించారు. బ్రాహ్మణీ స్టీల్స్ కు కాప్టివ్ మైనింగ్ ఇవ్వడంపై చంద్రబాబు శాసనసభలో చేసిన ఆరోపణలపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు శాసనసభను వేదికగా వాడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రాయలసీమలో పది వేల మందికి ఉపాధి కల్పిస్తున్న బ్రాహ్మణి స్టీల్స్ పై ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలున్నా తెలుగుదేశం పార్టీ కావాలనే బ్రాహ్మణి స్టీల్స్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. బ్రాహ్మణీ స్టీల్స్ పై ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు వివరణ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.