• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రముఖ రచయిత పతంజలి ప్రధమ వర్ధంతి నేడు

By Santaram
|

KNY Patanjali
హైదరాబాద్: ప్రముఖ రచయిత, ఎడిటర్ కెఎన్ వై పతంజలి మరణించి నేటికి సరిగ్గా ఏడాది. ఆయన కోసం ఆయన ఆత్మీయులు హైదరాబాద్ సోమాజీగుడా ప్రెస్ క్లబ్ లో నేటి సాయత్రం ఐదు గంటలకు ఆయనను గుర్తు చేసుకోబోతున్నారు. రచయితగా, జర్నలిస్టుగా ఆయనకు ఆయనే సమకాలికుడు. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2009 మార్చి 11న పతంజలి ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలేశారు. వైద్యునిగా, రచయితగా, జర్నలిస్టుగా ఎందరికో సుపరిచితులైన పతంజలి పూర్తి పేరు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి. 1952, మార్చి 29న విజయనగరం జిల్లా అలమండలో కెవివి.గోపాలరాజు, సీతాదేవి దంపతులకు జన్మించారు. ఎలిమెంటరీ స్కూల్‌ చదువుతోపాటుగానే తండ్రి వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్నారు. చిన్న వయసులోనే రచనలు చేయడం ప్రారంభించారు. అనంతరం జర్నలిస్టుగా మారి 1975 నుంచి 84 వరకు ఈనాడు, 1984 నుంచి 1990 వరకు ఉదయంలో పనిచేశారు.

అటు తర్వాత ఆంధ్రభూమి, మహానగర్‌లలో కూడా పని చేశారు. 'పతంజలి పత్రిక' పేరిట పత్రికను నెలకొల్పి 16 నెలల పాటు నడిపారు. 2003లో ఆంధ్రప్రభలో అవకాశం రావడంతో అందులో చేరారు. కొద్ది నెలలు టీవీ 9లో విధులు నిర్వర్తించారు. 'సాక్షి' పత్రిక ఆవిర్భావం నుంచి ఎడిటర్‌గా వ్యవహించారు. కొద్ది నెలల్లోనే ఆయన ఆరోగ్యం క్షీణించటంతో ఆస్పత్రిలో చేరారు. కోలుకున్న తరువాత మళ్లీ ఎడిటర్‌గా విధులు నిర్వహించారు. అయితే మరోసారి తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో ఈ దఫా మృత్యువుదే పైచేయి అయింది.

పతంజలి ఎన్నో నవలలు, కథలు, కథనాలు రాశారు. అందులో ఖాకీవనం, రాజుగోరు, వీరబొబ్బిలి, పెంపుడు జంతువులు, అప్పన్న సర్దార్‌, గోపాత్రుడు, ఒకదెయ్యం ఆత్మకథ, పిలక తిరుగుడు పువ్వు, మేరా భారత్‌ మహాన్‌, రాజుల లోగిళ్లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. పతంజలికి ఎన్నో పురస్కారాలు కూడా దక్కాయి. రావిశాస్త్రి రచనా పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం ఇందులో ప్రధానమైనవి. కృష్ణవంశీ 'సింధూ రం' సినిమాకు ఆయనకు ఉత్తమ మాటల రచయితగా బంగారు నంది అవార్డు దక్కింది. అనంతరం చంద్రసిద్ధార్థ 'ఇదీసంగతి'కి కథ, మాటలు రాశారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పతంజలి ముందుండేవారని ఆయన సహచరులు చెబుతుంటారు. రచన, జర్నలిజం, వైద్యం...ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ఎందరికో ఆదర్శప్రాయులు. నవతరం రచయితలకు స్ఫూర్తిప్రదాత. ఆయన మరణించి ఏడాది అయిన సందర్భంగా ఆయన్ను ఒక్కసారి గుర్తు చేసుకుని అంజలి ఘటించడం మనందరి బాధ్యత.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X