హైదరాబాద్: బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు మండల స్థాయిలో అఖిల పక్ష కమిటీలు వేస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య హామీ ఇచ్చారు. రేషన్ కార్డుల ఏరివేతపై గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఎన్నికలకు ముందు ఇష్టమున్నట్లు కార్డులిచ్చారని, ఎన్నికలు ముగియగానే అర్హులైనవారి కార్డులు కూడా తొలగిస్తున్నారని తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. కార్డుల ఏరివేత పారదర్శకంగానే సాగుతోందని అంటూ పౌర సరఫరాల మంత్రి జూపల్లి కృష్ణారావు లెక్కలతో సహా వివరించారు. దాంతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు.
తోపుడు బండ్లవారి కార్డులు కూడా తొలగిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. బోగస్ కార్డుల ఏరివేతకు అఖిల పక్ష కమిటీలు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కు ముఖ్యమంత్రి రోశయ్య అంగీకరించారు. కొందరు అధికారుల వల్లనే కార్డుల ఏరివేతలో సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు. అధికారులు కొంత మంది ఎక్కడో కూర్చుని రేషన్ కార్డుల తొలగింపు చర్యలు చేపడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు.