న్యూఢిల్లీ: మహిళా బిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ సిద్ధంగా ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. లోకసభలో బిల్లు ప్రతిపాదనకు ముందే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఏకాభిప్రాయ సాధనకు అన్ని పార్టీలను సంప్రదిస్తామని, తద్వారా అభిప్రాయ భేదాలను తగ్గించడానికి ప్రయత్నిస్తామని ఆయన గురువారం చెప్పారు. లోకసభలో ఆయన ఈ విషయం చెప్పారు.
మహిళా బిల్లుపై గురువారం కూడా పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికాయి. దీంతో సభలు వాయిదా పడ్డాయి. ఏడుగురు సభ్యులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తేయాలని ప్రతిపక్ష బిజెపి, అన్నాడియంకె, వామపక్షాల సభ్యులు గురువారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్తేనే సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిది. కార్యక్రమాలు స్తంభించడంతో సభ వాయిదా పడింది.