న్యూఢిల్లీ: మహిళా బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) చిక్కుల్లో పడింది. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు చేస్తామని పార్టీ లోకసభ సభ్యులు కొంత మంది హెచ్చరిస్తున్నారు. దీంతో విప్ జారీ చేసి వారిని నియంత్రించే ఆలోచనలో బిజెపి నాయకత్వం ఉంది. తిరుగుబాటు తలెత్తిన నేపథ్యంలో లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ, బిజెపి మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
ఆ నేతలు గురువారం ఉదయం అసమ్మతివాదులైన పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. లోకసభలో మహిళా బిల్లుపై వోటింగ్ కు తాము విప్ జారీ చేస్తామని సుష్మా స్వరాజ్ చెప్పారు. యోగి ఆదిత్యనాథ్, హుకుమ్ దేవ్ నారాయణ యాదవ్, రమేష్ బియాస్ వంటి లోకసభ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. 116 మంది సభ్యులున్న బిజెపి మద్దతు బిల్లు ఆమోదం పొందడానికి ఎంతో కీలకం.