ఉండవల్లిపై విరుచుకుపడిన రోశయ్య

'నాకు అడ్రెస్ చేస్తూ లేఖ రాస్తావు. కానీ ఆ లేఖను నాకు ఇవ్వవు. నేను దాన్ని మరుసటి రోజున పత్రికల్లో చూసుకుంటాను. ఇదేనా పద్ధతి?' అని రోశయ్య నిలదీశారు. "నువ్వు, నాకు రాసిన లేఖను నేను పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూసుకోవాలా?' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. "అసలు మీరేం అనుకుంటున్నారు? ఏమిటీ తమాషా? నాతో ఆటలాడుకుంటున్నారా? పద్ధతి లేదా?" అంటూ రోశయ్య విరుచుకుపడ్డారు. ఈ సమయంలో ఉండవల్లి జోక్యం చేసుకుని..."సార్..ఎదురుగా మీడియా వాళ్లు ఉన్నారు. మనం మీ చాంబర్ కు వెళ్లి మాట్లాడుకుందాం" అని విన్నవించుకున్నారు. అయినా ముఖ్యమంత్రి తగ్గలేదు. నువ్వు చేసేదంతా మీడియా కోసమే కదా అని రోశయ్య ఉండవల్లిపై విరుచుకుపడ్డారు.
ఆ సమయంలో పక్కనే ఉన్న రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్‌రావు ముఖ్యమంత్రిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఆయన ఆగ్రహం చల్లారలేదు. దీంతో ఉండవల్లి నిస్పృహగా "నేను బ్యాడ్ టైంలో వచ్చాను. మాట పడిపోయాను" అని వ్యాఖ్యానించారు. తర్వాత ముఖ్యమంత్రి తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు. ఆయనతో పాటు జేసీ దివాకరరెడ్డి, మర్రిశశిధర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కంతేటి సత్యనారాయణరాజు కూడా ముఖ్యమంత్రితో పాటు వెళ్లారు. అప్పటికే సీఎం చాంబర్‌లో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. కాసేపటికి మంత్రి వట్టి వసంతకుమార్, రౌతు సూర్యప్రకాశరావు కూడా సీఎం చాంబర్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత కేవీపీ, ఉండవల్లి సీఎంతో ఏకాంతంగా మాట్లాడాల్సి ఉందన్న సమాచారం మిగతావారికి చేరింది. దాంతో వారందరూ చాంబర్ నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత కేవీపీ, ఉండవల్లి రోశయ్యతో ఏకాంతంగా చర్చించారు.
మార్గదర్శి కేసు విషయంలో రామోజీరావుపై గతంలో చేసిన ఫిర్యాదుల గురించి ప్రస్తావిస్తూ లేఖ రాశానని, ఇందులో ఎవరినీ విమర్శించ లేదని ఉండవల్లి ఈ సందర్భంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి ఒక దిన పత్రికలో వచ్చిన క్లిప్పింగులను, ఆ పత్రికకు విడుదల చేసిన లేఖను కూడా చూపించారు. ఆ లేఖలో...ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఉన్న వ్యాఖ్యానాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ముఖ్యమంత్రికి, ఉండవల్లికి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేవీపీ ప్రయత్నం చేశారు. అయితే అవి పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇవ్వలేదని సమాచారం. ఈ అంశంపై ఉండవల్లిని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే "ముఖ్యమంత్రి తనపై ఆగ్రహం వ్యక్తం చేయలేదు" అని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications