హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాబరే డ్యాన్సులపై నారాయణ నిప్పులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నిప్పులు చెరిగారు. ప్రపంచ కార్మిక దినం సందర్భంగా శనివారం ఇక్కడ గాంధీభవన్‌ లోని ప్రకాశం హాలులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోశయ్య సీఎం అయ్యాక..ఆదాయం కోసం జనానికి మద్యం ఎక్కువ తాగించాలని హుకుం జారీ చేశారని మండిపడ్డారు.

క్యాబరే డ్యాన్స్ ‌లు పెడితే మద్యం ఎక్కువ అమ్మవచ్చని అధికారులు చెబితే..ఒక్క హిమాయత్‌నగర్‌లోనే 13 కేంద్రాల్లో క్యాబరే డ్యాన్సులకు అనుమతి ఇచ్చారన్నారు. క్యాబరే డ్యాన్స్‌లు పెట్టి జనానికి మద్యం తాగిస్తారా? అని సీఎం రోశయ్యను నిలదీశారు. క్యాబరేలు, పబ్బులు ద్వారా మద్యం అమ్ముకునే స్థాయికి ప్రభుత్వం దిగజారిందన్నారు. "రోశయ్య తాగుబోతు కాకపోవచ్చు. కాని, కుట్రదారే" అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి అదనపు విద్యుత్ కావాలంటూ కేంద్రాన్ని కోరటానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ప్రభుత్వం ఢిల్లీకి పంపించటాన్ని తప్పుపట్టారు. "రోశయ్య ప్రభుత్వం మూడు అడుగుల పొడవున్న పొన్నాలను ఢిల్లీకి పంపింది. ఆయనకు పరమానందయ్య శిష్యులకు తేడా లేదు. విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వానికి చేతకాకపోతే దిగిపోవాలి. మాకు బాధ్యత అప్పగిస్తే 4 గంటల్లో పరిస్థితి చక్కదిద్ది చూపుతాం" అని చెప్పారు.

కార్మిక శాఖ..మేత లింగంగా మారిందని, లంచాలు తీసుకోవటానికే ఉపయోగపడుతోందన్నారు. కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్ విషయంపై సీఎం, మంత్రులను కలిస్తే..తామే దినదినగండంగా పదవుల్లో కొనసాగుతున్నామని సమాధానం చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

బోగస్ కార్డులన్నీ రేషన్ డీలర్ల వద్దనే ఉన్నాయని, దొంగలను ఇంట్లోనే పెట్టుకొని ప్రభుత్వం ఊరంతా తీరుగుతోందని దుయ్యబట్టారు. కింది నుంచి పై వరకు 17 మందికి లంచాలు ఇవ్వాల్సి ఉందంటూ బోగస్ కార్డులన్నింటినీ రేషన్ డీలర్లు తమ వద్దనే ఉంచుకుంటామని ఖరాఖండిగా చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X