హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని అధిష్ఠానం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని గనలు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రారంభమయ్యే జగన్ ఓదార్పు యాత్రలో తనతోపాటు ప్రకాశం జిల్లా శాసనసభ్యులు పాల్గొంటారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఓదార్పు యాత్ర కోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పారు. ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో ప్రకాశం జిల్లా కాంగ్రెసు శాసనసభ్యులంతా పాల్గొంటారని తనకు 90 శాతం నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ఏడు రోజులు నిర్వహించాలని తొలుత అనుకున్నామని, అయితే అది మరిన్ని రోజులు జరగవచ్చునని ఆయన అన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైయస్ జగన్ కు సమీప బంధువు కూడా.