తెలంగాణపై వ్యాఖ్య: 16 మంది సీమాంధ్ర మంత్రులకు షాక్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకోవడం జాతి విద్రోహమని శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదికపై 16 మంది సీమాంధ్ర మంత్రులకు షాక్ తగిలింది. వారిపై కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టాలని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు శుక్రవారం సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. సీమాంధ్ర మంత్రులపై 499, 500, 153ఎ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. సీమాంధ్ర మంత్రులపై తెలంగాణ న్యాయవాదుల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) తరఫున శ్రీరంగారావు నాంపల్లి కోర్టుకు ఫిర్యాదు చేశారు.
కాగా, తాను తెలంగాణవారిని కించపరచలేదని సీమాంధ్ర మంత్రి గాదె వెంకట రెడ్డి చెప్పారు. తెలంగాణవారిపై తనకు అపార గౌరవం ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే, నివేదికను మాత్రం తాను మీడియాకు అందించలేనని ఆయన చేతులెత్తేశారు. సీమాంధ్ర మంత్రులపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో పార్టీ ప్రతినిధులు గురువారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఆ మంత్రులను బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.