హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తేల్చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ తెలంగాణ నేతల వాదనకు విలువ లేకుండా చేశారు. తెలంగాణపై తాను చెప్పేదే పార్టీ వైఖరి అని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణపై తమ పార్టీ తెలంగాణ నేతలు చెబుతున్నవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని ఆయన తేల్చి పారేశారు. సున్నితమైన అంశంపై సంయమనం పాటించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. గత అయిదేళ్లలో రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు ఏపీఐఐసీ ఏమేరకు సహకరించిందో విచారణ జరపాలని కోరారు. సీబీఐ విచారణ జరిపితే పెద్దలంతా బయటకు వస్తారన్నారు. రాష్ట్రంలోని ఖనిజసంపద అంతా ఒకే కుటుంబం చేతుల్లో ఉందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను బయట పెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.