వైయస్ జగన్ కు తిప్పలే: వీరప్ప మొయిలీపై సోనియా గాంధీ గుర్రు
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీరు చూస్తుంటే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు తిప్పలు తప్పేట్లు లేవు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల పట్ల ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని పిలిచి ఆమె క్లాస్ తీసుకున్నట్లు ఓ ప్రముఖ దిన పత్రికలో వార్తాకథనం అచ్చయింది. ఇటీవల పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ జగన్ తో సంధి యత్నాలు చేసిన విషయంపై కూడా ఆమె తీవ్రమైన ఆగ్రహంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ చర్చల వెనక మీరేమైనా ఉన్నారా అంటూ మొయిలీని ఆమె నిలదీసినట్లు చెబుతున్నారు. జగన్ విషయంలో ఏ మాత్రం పట్టువిడుపులు ప్రదర్శించేందుకు ఆమె సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో నాయకుల క్రమశిక్షణా రాహిత్యంపై మొయిలీ మెతగ్గా వ్యవహరించడంపై కూడా ఆమె కోపంగా ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి పార్లమెంటు ఆవరణలో సోనియాను ఆమె తల్లి ఆరోగ్యం గురించి ఆరా తీయబోయారు. అయితే సోనియాను ఆమెను ఏ మాత్రం పట్టించుకోలేదు. చిరునవ్వు కూడా విసరలేదు. అదే మందా జగన్నాథంతో ఆమె నవ్వుతూ మాట్లాడారు. కిల్లి కృపారాణి భర్త శ్రీకాకుళం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. కిల్లి కృపారాణిపై సోనియా ఆగ్రహం అదేనని అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దగ్గరకు పిలిలి మరీ మాట్లాడారు. పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడేందుకు త్వరలో తనను కలుసుకోవాలని ఆమె ఆయనకు సూచించారు.