వైయస్ జగన్ కు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల ప్రశ్నలు

ఎమ్మెల్యేలు జగన్ కు అందించిన నోట్ లోని అంశాలు ఇలా ఉన్నాయి -
1. రాహుల్ గాంధీ అత్యున్నత స్థానంలో ఉన్నా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఎంతో నమ్రతతో పనిచేస్తున్నారు. పదవులు తీసుకోకుండా శ్రమిస్తున్న రాహుల్ ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా?
2. మీరు వేరే పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తలను ఇంతవరకూ ఖండించలేదు. శాసనసభ్యులను కూడగడుతున్నారన్న వార్తలను కూడా ఎప్పుడూ బహిరంగంగా తోసిపుచ్చలేదు. పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి.
3. జాతీయ పార్టీని నడిపేటప్పుడు పార్టీ అనేక కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అనేక రాష్ట్రాల్లో పార్టీని సమన్వయం చేయాలంటే ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. నిబద్ధత గల పార్టీ సభ్యులుగా మనం అధిష్ఠానానికి వెసలుబాటు కల్పించాల్సిన అవసరం లేదా?
4. మన్మోహన్ చెబితే ప్రపంచం వింటుందని ఒబామా అంతటి వ్యక్తే చెబుతున్నప్పుడు పార్టీ సభ్యులైన మనం అధిష్ఠానం మాట వినకపోతే ఎలా?
5. ఓదార్పు యాత్ర బల ప్రదర్శనగా మారుతున్న సందర్భంలో ఎమ్మెల్యేలు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
6. పార్టీ అధ్యక్షురాలితో జరిపిన చర్చల వివరాలను బహిరంగ పర్చడంతో పాటు, ఆమె వద్దని చెప్పినా యాత్రకు వెళ్తున్నానని పార్టీలో ఉంటూనే బహిరంగంగా చెప్పడమంటే అధ్యక్షురాలిని బలహీన పరచడం కాదా?
7. మీకు కేంద్ర మంత్రివర్గంలో తగు స్థానం కల్పిస్తామని నాలుగు నెలల క్రితం అధ్యక్షురాలే సూచనాప్రాయంగా చెప్పినట్లు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర అన్న మాట వాస్తవమా? కాదా?
8. ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించిన సోనియా, మన్మోహన్‌ల నేతృత్వంలో పని చేస్తున్నందుకు గర్వపడాల్సిన సమయంలో వారికి, పార్టీకి హాని కల్గించే విధంగా ప్రవర్తించడం సమంజసమా?
కాగా, ఓదార్పు యాత్రకు బయలుదేరిన తర్వాత పార్టీ పెద్దలకు దూరంగా మసలుతున్న జగన్ తొలిసారిగా బుధవారం రాత్రి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఓదార్పు యాత్రకు అడ్డంకులు కల్పించొద్దని విజ్ఞప్తి చేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. వెళ్లొద్దని ఎంపీలను సోనియా ఆదేశించడం, అధిష్ఠానం మార్గదర్శనం కోసం ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలంతా రావడంతో పరిస్థితులు మరింత ముదరకుండా చూడాలని కోరడానికే జగన్ ప్రణబ్‌ను కలిసి ఉండొచ్చని ఒక ఎంపీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications