గాడ్జిల్లా vs కాంగ్ నటి జియా కన్నుమూత: 18 ఏళ్లకే..!!
హాలీవుడ్ సూపర్ హిట్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కైలీ హాటిల్ కన్నుమూశారు. 18 సంవత్సరాల వయస్సులోనే ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. అమెరికా మేరీల్యాండ్ లో సంభవించిన ఓ రోడ్డు ప్రమాదం ఆమెను పొట్టనపెట్టుకుంది. చిన్న వయసులోనే ఆమె మరణించడం హాలీవుడ్ పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాడ్జిల్లా సిరీస్ అభిమానులను షాక్ కు గురి చేసింది.
కైలీ హాటిల్ తండ్రి జాషువా హాటిల్ ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ సమాచారాన్ని వెల్లడించారు. కైలీ చదువుకుంటోన్న టెక్సాస్ స్కూల్ ఫర్ ది డెఫ్ కూడా తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆమె మరణాన్ని ధృవీకరించింది. మేరీల్యాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి అత్యాధునిక చికిత్స అందించారు డాక్టర్లు. అయినపప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల తుదిశ్వాస విడిచారు.

పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్నప్పటికీ.. తన అద్భుత నటనతో కైలీ హాటిల్ ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారని పేర్కొంది. ఆమెకు కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు తెలిపింది. 2021 లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ గొడ్జిల్లా వర్సెస్ కాంగ్ తో కైలీ హాటిల్.. హాలీవుడ్ లోకి అరంగేట్రం చేశారు. ఇందులో జియా అనే బధిర అనాథ బాలిక పాత్రలో అద్భుతంగా నటించారు. ఆమె క్యారెక్టర్ కీలకం ఈ మూవీలో. కాంగ్ కు ఫ్రెండ్ గా ఆమె పాత్రను డిజైన్ చేశారు.
ఈ పాత్రకు మంచి ఆదరణ లభించింది. దీంతో 2024 లో విడుదలైన గొడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ సీక్వెల్‌లో కూడా కైలీ నటించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక శాటర్న్ అవార్డ్ నామినేట్ అయ్యారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ బై ఏ యంగర్ యాక్టర్ కేటగిరీలో నిలిచారు. పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది కైలీ హాటిల్ కు. ఆమె కుటుంంబంలో నాలుగు తరాల నుంచీ ఈ జన్యులోపం వెంటాడుతోంది.
అయినప్పటికీ.. హాలీవుడ్ స్టోరీ డిస్కషన్స్ ను తన సైన్ లాంగ్వేజ్‌కు తగినట్టుగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇది చాలా కష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సినిమా షూటింగ్ సమయాల్లో తన సైన్ లాంగ్వేజ్ ను కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోయేవారని, అయినా వాటన్నింటినీ అధిగమించి, పాత్రకు న్యాయం చేయగలిగానని ఆమె చెప్పారు. హాలీవుడ్ చిత్రాల్లో సంభాషణలతో పని లేకుండా కళ్ల ద్వారానే హావభావాలు పలికించారు.












Click it and Unblock the Notifications