వైయస్ వివేకానంద రెడ్డి సోనియాకు రాసిన లేఖ పూర్తి పాఠం

విషయం: గాంధీ కుటుంబానికి విధేయత
గౌరవనీయురాలైన మేడమ్,
నమస్తే!
మా కుటుంబం పట్ల మీరు చూపుతున్న నిరంతర అభిమానానికి, అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. మీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి చెక్కు చెదరని విధేయతను, మద్దతును తెలిపేందుకే నేను ఈ లేఖ రాస్తున్నాను. మేడమ్, మేము నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఎప్పటికీ విధేయులమన్న సంగతి మీకు బాగా తెలుసు. అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా మా అన్నయ్య డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాంధీ కుటుంబానికి బలమైన మద్దతును అందించారు.
మమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా రోడ్లపై విసిరేసేందుకు ప్రయత్నించిన మా శత్రువుల నుంచి కాపాడేందుకు గాంధీ కుటుంబం అందించిన సహాయాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేము. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు వ్యతిరేకించినప్పటికీ మేడమ్ ఇందిరాజీ, రాజీవ్ జీలు వైఎస్సార్ కు 1985లో అత్యంత పిన్న వయస్సులోనే పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించారు. అది ఆంధ్రప్రదేశ్‌లో మా కుటుంబం పరిస్థితిని మార్చేసింది.
1999లో పీసీసీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత సీఎల్పీ నేతగా (ఎన్నికల్లో ఓడినప్పటికీ) నియమించి మా సోదరుడిని ఆదుకున్న వ్యక్తి మీరే. మా అన్నయ్య పీసీసీ అధ్యక్షుడు కానప్పటికీ 2004లో, 2009లో మీరు ఆయనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ రోజు మేం ఎలాంటి పదవులు అనుభవిస్తున్నప్పటికీ అది మీ కుటుంబ ఆశీర్వాదం వల్ల మాత్రమే! నాకు గాంధీ కుటుంబ నాయకత్వంలోని పార్టీ ఇచ్చిన అవకాశాల వల్లే కొన్నేళ్లుగా వివిధ స్థాయిల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది. ఇప్పటిదాకా నేను నిర్వహించిన పదవులు ఇవి...
- సమితి (బ్లాకు)అధ్యక్షుడు 1979-84
- ఎమ్మెల్యే 1989-1994
- లోక్ సభ సభ్యుడు1999-2004
- లోక్ సభ సభ్యుడు 2004-2009
- శాసన మండలి సభ్యుడు - ప్రస్తుతం (ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను) మీ మహోన్నత నాయకత్వాన్ని, పార్టీని దెబ్బతీసే ఎలాంటి చర్యలకు నేను పాల్పడను. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా మీ నాయకత్వం పట్ల నా విధేయతను, నిబద్ధతను మరోమారు పునరుద్ఘాటిస్తున్నాను.
విధేయతతో ...
వైఎస్ వివేకానంద రెడ్డి
మాజీ ఎంపీ, కడప.












Click it and Unblock the Notifications